మావయ్యా ముందుగా 70 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన జన్మదిన శుభాకాంక్షలు.
జీవితమంటే జ్ఞాపకాల సమాహారం. చివరికి మిగిలేది జ్ఞాపకాలే .
మావయ్యా నా జ్ఞాపకాల పయనం నీతో ఇలా మొదలైంది.
నీళ్ళ చెంబు
వేసవి కాలం సెలవులు నాయనమ్మ గారింటికి వచ్చాం . అక్కడనుంచి అమ్మమ్మ గారింటికి . నీళ్ళ గాబు . పక్కనే చిన్న కుళాయి. కుళాయి నుంచి నీరు కారుతోంది. నీళ్ళ చెంబుతో ఆడుతున్నాను . నీరు వ్యర్ధం అవుతుంది కదా కుళాయి కింద చెంబు పెడితే ఆ నీరు వాడుకోవచ్చు కదా అనేది నా ఆలోచన . కాని నాకు అది ఎప్పటికి నిండుతుందో తెలియదు. వెంటనే నేను అమ్మని అది ఎప్పటికి నిండు తుంది అని అడిగాను. అమ్మ వెంటనే మావయ్యనడుగు చెబుతాడు అంది . మిమ్మల్ని అడిగితే చేతి గడియారం చూసి సాయంత్రం ఐదు గంటలకు రా నిండుతుంది అని అన్నారు. నేను మధ్య మధ్య లో వచ్చి చూసి వెళ్ళిపోయాను. సరిగ్గా ఐదు గంటలకి ఆ చెంబు నిండింది. ఎలా చెప్పారా అని నా కప్పట్లో ఆశ్చర్యం.
గోపీ వస్తున్నాడు జాగ్రత్త
చిన్నప్పుడు నాకోక అలవాటుండేది. ఎవరింటికి వెళ్ళినా నాకు నచ్చిన వస్తువుని చక్కబెట్టేవాడిని. గుంటూరు తాతయ్య గారింటి నుంచి నరసరావుపేట వచ్చాము. ఇంట్లో చిన్న చిన్న చెప్పుల జతలు చాలా ఉండేవి. అవంటే నాకు చాలా ఇష్టం . ఆడుకున్నంత సేపు ఆడుకోని అవి మా సంచి లో వేసేశాను. ఎవరికీ చెప్పలేదు. తిరిగి గుంటూరు వెళ్ళటానికి రైల్వే స్టేషన్ కి వచ్చాము. ఇంతలో మా అమ్మ వాటిని చూసింది . వాటిని తిరిగి మీకు ఇచ్చేసింది. అప్పుడు నేను వాటికోసం చేసిన అల్లరి ఏడ్చిన తీరు నాకింకా జ్ఞాపకమే.
ఆపద్బాన్ధవ్యుడా
మా ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటే బాగుండు, ఇంటికి ఎవరన్నా వస్తే బాగుండు అని అనుకునేవాడిని. ఎందుకంటే అమ్మ చేతి చివాట్లు తప్పేవి . చివాట్లతో సరిపెడుతున్నాను. మిగతావి మీకు తెలియనివి కావు. అలా గడుస్తున్న రోజులలో ఎన్నోసార్లు ఆపద్బాన్ధవుడవయ్యావు.
పిచ్చి గీతలు
నేను ఒకటో తరగతి లో ఉండంగా నా వద్ద ఒక పెన్సిల్ డబ్బా వుండేది. ఆ డబ్బా మీద డోనాల్డ్ డక్ బొమ్మ ఎత్తుగా ఉండేది . బొమ్మలు వేయడం ఇష్టం కనుక నేను ఒక పెన్సిలు కాగితం తీసుకుని దాన్ని అచ్చు వేసాను . అది సరిగ్గా రాలేదు. ఏదో ఒక ఆకారం సంతరించుకుంది. మా ఇంటికి ఒకసారి వచినప్పుడు కోతబోమ్మలు ఎం గీసావ్ అని అడిగారు. అప్పుడు నేను ఆ అచ్చు వేసిన బొమ్మని చూపించాను. వెంటనే మీరు "నాకు ఈ బొమ్మ కావలి . నేను తీసుకెళ్తాను" అని అడిగారు. అది విన్న అమ్మ వంటగది నుంచి వచ్చి ఏంటి అన్నయ్య ఈ పిచ్చి గీతలను బొమ్మలంటావు అని అడిగింది. అప్పుడు మీరు " నాకు ఒక అమ్మాయి నీళ్ళు పోసుకున్తున్నట్టుగా వుంది "అని అన్నరు. అది విన్న నేను ఆ బొమ్మ ని రెండు సార్లు చూశాను. నాకు అలాగే అనిపించింది . అలా ఆ పిచ్చి గీతలను బొమ్మలని అడగక పోతే నేను బొమ్మలేసుండేవాడిని కాదేమో .
వేసవికాలం సెలవులు
సంవత్సరం పాటు బడికెళ్ళి కష్కష్టపడి చదివి ఆ కష్టం అంతా మరిచిపోయేట్టుగా చేసేవి వేసవి కాలం సెలవులు. మూడు నెలలు ఖాళీగా ఇంట్లో తిని కూర్చోవడమే అని అమ్మ తిట్టుకున్నా నాకు మాత్రం అవి ఎంతో ఆనందాన్ని కలగజేసేవి . ఎందుకంటే చదవక్కరలేదు, పరీక్షలు లేవు, క్రికెట్ ఆడుకోవచ్చు , మిత్రులతో కాలక్షేపం చేయోచ్చు, ఊర్లు వెళ్లి రావచ్చు, రోడ్లవెంట తిరగొచ్చు . నేను బహుశా 9వ తరగతి చదివేవరకు అన్ని వేసవి కాలం సెలవుల్లో నరసరావుపేట కచ్చితంగా వచ్చివెళ్లుంటాను.
ముప్పాళ్ళ క్యాంపు
నాన్నకి తీరిక లేకపోవడం ఎక్కడికి పెద్దగ తిరగక పోవడం వల్లనో ఏమో తెలియదు కానీ బస్సు ప్రయాణాలన్నా, రైలు ప్రయాణాలన్నా అసలు తిరగడమన్నా చాలా ఇష్టం గా మారింది. కిటికీ పక్కనే కూర్చునే అవకాశం వస్తే అస్సలు వదిలిపెట్టేవాడిని కాదు, విమానం ఎక్కేవరకు. వచ్చీపోయే ఊళ్ళ పేర్లు చదివి గుర్తుపెట్టుకునే వాడిని. ఎవరన్నా తోటి ప్రయాణికులు బండి ఎక్కడ ఆగుతుంది అంటే టక్కున చెప్పేవాడిని . అలాంటి ఒక ప్రయాణమే ముప్పాళ్ళ క్యాంపు. ఒక రోజు పొద్దున్నే నిద్ర లేచాను ఇంట్లో ఎవరూ లేరు . నాకు ఏమి తోచట్లేదు . క్యాంపు కి సిద్ధమవుతున్నారు . "ఏరా వస్తావా?" అని అడిగారు. అడిగిందే తడవుగా నేను సరే అన్నాను. జీపు లో ప్రయాణం కిటికీలు లేవు. రోడ్డు చక్కగా కనిపిస్తుంది. పైగా ఒక హోటల్ లో నేను బాగా ఇష్టం గా తినే పూరి తిన్నాం. ఇక నా ఆనందానికి అవధుల్లేవు.ఇవాన్నీ చిన్న చిన్న జ్ఞాపకాలే కావొచ్చు కాని నాకవి అమూల్యమైనవి. ఎందుకంటే నాకెంతో ఆనందాన్ని కలగజేసేవి.
వోట్ ఫర్ BJP, Eraldite సీసా
అక్క తో పాటు ఎండాకాలం సెలవులకు నరసరాపేట వచ్చాను. బాయిలర్ లో నీళ్ళు కాచుకోవడానికి బొగ్గు వుండేది . ఆ బొగ్గు తీసుకుని గోడలనిండా కమలం గుర్తులు దానికింద వోట్ ఫర్ BJP , BJP గుర్తుకే మీ వోటు అని రెండు భాషలలో చక్కగా రాశాను. ఇంకేముంది కొద్ది సమయానికి అందరూ చూశారు. తిడతారేమో, కొడతారేమో అనుకున్నా కానీ రెండు జరగలేదు. అలాగే eraldite సీసా పొరపాటున చెయ్యి తగిలి కిందపడి పగిలిపోయింది. నాకు ఏమి తోచని పరిస్థితి. అప్పుడూ ఏమీ అనలేదు . ఈ రెండు సంఘటనలు నా తప్పును నేను తెలుసుకుని బాధపడే లా చేశాయి. అంతే కాదు మళ్ళీ సెలవులకు నన్ను రానివ్వరేమో అని భయం వేసింది. నాకు మీతో సమయం గడపడం అంత ఇష్టం.
అక్షరాలూ బొమ్మలు
మూడవ తరగతి కాబోలు . బొమ్మలు బాగా వేస్తాను అని తెలుసు కాబట్టి నాకొక చిన్న పరీక్ష పెట్టారు. అక్షరాలను సంఖ్యలను ఇచ్చి వాటిని బొమ్మలు గా మలచామన్నారు . నేను ప్రతి అక్షరాన్ని బొమ్మగా మలిచాను. అది ఇంట్లో అందరికి చూపించారు. అందరు మెచ్చుకున్నారు. చిన్నప్పుడు వచ్చే ఆలోచనలకు , ఊహలకు అసలు అంతేముంది . కాని ఆ ఆలోచనకు పదును పెట్టారు.
క్రికెట్ కామెంటరీ
చదువు మీద కన్నా ఆటలు ముఖ్యంగా క్రికెట్ మీద ఇష్టం పెరుగుతున్న రోజులవి . టీవీ లో గంటలు తరబడి క్రికెట్ మ్యాచ్ లు చూసేవాడిని. కరెంటు పోయి ఏమి చెయ్యాలో తోచక బండల మీద నీళ్ళు చల్లుకుని మంచాలు వేసుకుని గాలిలేక దోమల గోల మధ్య లో నా పిచ్చి వాగుడు. అదే క్రికెట్ కామెంటరీ . మ్యాచ్ లు ఎక్కువగా చూస్తుండేవాడిని గనక అందులోనూ ఆడేటప్పుడు మాకు మేమే కామెంటరీ చెప్పుకునేవాలం కనుక నోట్లో బాగా కామెంటేటర్ల కంమెంట్లు బాగా నానుతుండేవి . అలా గోడమీద కూర్చొని నేను క్రికెట్ కామెంటరీ చెబుతుంటే దాన్ని చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఎలా చెప్పగలవో ప్రయత్నించమన్నారు. నన్ను బాగా ప్రోత్సహించారు. మాటలు మింగేస్తూ మౌనం గా ఉండే నాకు మాట్లాడే అవకాసం ఇచ్చారు.
ఇలా ప్రతివేసవి వినూత్నంగానే వుండేది . కొబ్బరిపీచు తో గుడిసె పైకప్పుని ఎంత చక్కగా దాన్ని పేర్చి అతికించారో . చీపురు పుల్లలతో గుడిసె చుట్టూ దడి . సన్నటి మట్టి ని బంకమీద చల్లి అలికిన నేల. గ్రీటింగు కార్డులు మిఠాయి డబ్బాల తో కూడా మేడలు కట్టొచ్చని చేసి చూపించావు. అసలు పనికి రాణి వస్తువు ఏదైనా ఉంటుందా అని అనిపించేది. ఇవి కాకుండా తపాలాబిళ్లలు , రూపాయి బిళ్ళలు సేకరించడం . పదవినోదాలు , ప్రతి ఆదివారం వచ్చే ఈనాడు తెలుగు పుస్తకం లో చుక్కలను కలపడం, టుమ్రీలు , రాసుకుంటూ పోతే రాసుకున్నన్ని .
ఇప్పటి వరకు చెప్పినవి అన్ని నన్ను మెచ్చుకున్న ప్రోత్సహించిన సందర్భాలు మాత్రమే. అక్క పెళ్లి చూపులైన తెల్లారి అద్దెకు గ్లాసులు తీసుకువచ్చాం. అవి తిరిగి లెక్కపెట్టి అద్దెకు తెచ్చిన దగ్గర ఇవ్వాలి . మూడుసార్లు లెక్కపెట్టుంటాను . ఒక్కోసారి ఒక్కో లెక్క . కాని తెచ్చిన లెక్క కి మాత్రం సరితూగట్లేదు . అప్పుడు నన్ను కోప్పడ్డావు . అప్పుడు కాదు మావయ్య ఇప్పటికీ అంతే . నోట్లు లేక్కేయడం నా వల్ల కాదు .
శ్రీనాథుని కవిత
నాకు లెక్కలు సరిగ్గా అర్ధమయ్యేవి కాదు . దాంతో అవకాసం దొరికినప్పుడల్లా తప్పించుకునే ప్రయత్నం చెసేవాడిని . తెలుగు అంటే ఎంతో ఇష్టం . అలానే ఒకసారి ఎనిమిదవ తరగతి లో శ్రీనాథుని కవిత కంఠస్ధం పడుతున్నాను . దానికి అర్ధం తెలియదు . ఇంతలో వేరే గదిలో ఉన్న మీరు వచ్చి దానికి అర్ధం చెప్పారు . ఇంతకి ఆ పద్యమేమిటంటే
" సిరిగలవానికి చెల్లును
తరుణులు పదియారువేల( తగ పెండ్లాడెన్
తిరిపెమున కిద్దరాండ్ర
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్ "
నేను ఎప్పుడు అలా చెప్పగలను, అదీ చదవకుండా అని ఒక సందేహం వుండేది. కాని తెలుగు భాష పట్ల ఇంకొంచెం ఇష్టాన్ని పెంచింది .
ఇంక పిల్లల విషయానికి వస్తే చెప్పనక్కర్లెదు. బడికి వెళ్ళడం మొదలు పెట్టిన తొలినాళ్ళలో రాఘవుడు, మధ్యతరగతులలో హరెమ్మ , హై స్కూల్ దశ లో రాముడు . నేను వారితో గడిపిన సమయం లేదా వారు నా కోసం కేటాయించిన సమయం నేనిలా రూపుదిద్దుకోవడానికి ఎంతగానో దోహదపడింది . నిరంతరం అందుబాటులో ఉంటూ నా వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడింది వారే . మా నాన్న వాళ్ళకు మీరు ఎలా మార్గదర్శిగా నిలిచారో దాన్నే అనుసరించి నన్ను ఇలా తీర్చిదిద్దారు. అందుకు నేను అందరికి కృతజ్ఞుడిని . దాన్ని తెలిజేయడానికి ఇంతకంటే మంచి సందర్భం కూడా వుండదు .
ఇవన్నీ గుర్తుచేసుకుంటూ వుంటే మీ ప్రభావం లేకుండా, ప్రమేయం లేకుండా కళను కళాకారులను ఆదరించాగాలిగేవాడినా, అభినందించగలిగేవాడినా ఆస్వాదించగలిగెవాడినా అనిపిస్తుంది. నిరంతరం ఏదో చెయ్యాలి అనే తపన, వయసు తో సంబంధం లేకుండా ఏదో ఒకటి చేస్తూ వుండాలి అన్న ఆశయం , ఖాళీ గా కూర్చోకూడదు , పని లేదు అనే మాటలేకుండా, పుస్తకాలు, లైబ్రరీ, నాటికలు... ఏది నిలకడ .
పిల్లలు , వాళ్ళ పిల్లలు, చదువులు, ఉద్యోగాలు, చికాకులు , ఆరోగ్యాలు, పనికిరాని చెత్తాచెదారం . ఇవన్నీ మనం సృష్టించుకున్నవే . వీటన్నిటి మధ్య ఒకరిగురించి ఆలోచించడానికి, అందరు ఒకచోట చేరి సంతోషంగా గదపడానికి కావలసిన సమయం ఎటు పోతొందో అర్ధం కాని పరిస్థితి. ఏడాదిన్నర కిందట నా పెళ్లి నాన్న పుట్టినరోజు సందర్భంగా మీరు జరిపించిన కార్యక్రమం నాకు నేను ఉన్నంతవరకు గుర్తుండిపోతుంది . ఇప్పటికీ అది మదిలో మెదులుతూనే వుంటుంది . తలుచుకున్నప్పుడుల్లా ఆనందం తో కళ్ళల్లో నీల్లోస్తాయి. అందరు ఒకచోట కలవడం అనేది చాల అరుదు గా జరుగుతుంటుంది. మళ్లీ ఎప్పుదు కలుస్తామా అనిపిస్తుంది. మీ పుట్టినరోజు సందర్భంగా అందరు కలుస్తున్నారని ఆశిస్తూ సెలవు.
సీతారామయ్య గారి మనవరాలు సినిమా నుంచి నన్ను ఎంతగానో ఆకట్టుకున్న ఆఖరున చెప్పే కొన్ని మాటలు
"మమతానురాగాల శాఖాచంక్రమణం
అక్కడ ప్రవహిస్తున్న గోదావరి లాగానే
ఎక్కడో సంసార సాగరం లో కలసి
సంతోష మేఘాలుగా ఎగసి
అనురాగ వర్షంగా కురిసి
జీవనది గా వెలసి... తిరిగి సాగరం లో కలిసి
మేఘాలుగా ఎగసి ...
నిరంతరంగా ... తరం తరంగా
కుటుంబ జీవన
ఔన్నత్యానికి అర్ధం పడుతుంది "
ఇట్లు
మీ గోపీ
No comments:
Post a Comment