Friday, June 27, 2014

నా ఆస్తులు



మేము నా చిన్నతనం లో మహబూబ్నగర్ జిల్లా, కొత్తూరు మండలం లో ఉండే వాళ్ళం. మా నాన్న  గారిది అక్కడే ఉద్యోగం. అక్కడ పనిచేసేవారు హైదరాబాదు లోనో , రంగాపురం లోనో , లేదా కొత్తూరు లోనో ఉండేవాళ్ళు . మేము మాత్రం కంపెనీ క్వార్టర్స్ లోనే ఉండేవాళ్ళం . మొత్తం ఐదు ఇళ్ళు . దాంతో అందరు ఇంటికి వచ్చి  పలకరించడం, నన్ను అడిoచడం చేసేవారు . అంతకు మించి పెద్ద కాలక్షేపం ఉండేది కాదు. కొంతకాలానికి టీవీ వచ్చింది . చిత్రహార్, చిత్రలహరి, రామాయణం, మహాభారతం, శనివారం , ఆదివారం సినిమాలు .

నా చదువు మొదలైంది . కొత్తూర్ లోని ఒక సాధారణ పాటశాల . అన్ని తరగతుల వారు  ఆ రెండు గదుల లో లేదా గదుల ఎదుట మెల్లా  లోనే విద్యనభ్యసించేవారు  .  బడికి వెళ్లి రావడం , ఇంటికి వచ్చి ఏదన్నా తిని చదవడం వ్రాయడం , అక్షరాలూ దిద్దడం. మా అమ్మే  నాకు ఇంట్లో టీచరు . తప్పుగా రాసిన , అక్షరాలూ గుండ్రంగా లేకపోయినా అసలు ఊరుకునేది కాదు. అందుకే పలక మీద నేను పిచ్చి గీతలు గీసేవాడినో లేదో అంతగా గుర్తు లేదు. గీసేవుంటానులెండి ఎందుకంటే పెన్సిలు పట్టుకుని బొమ్మలు వేసేవారి దగ్గర నుంచి కుంచె పట్టుకుని రంగులేసేవారి వరకు అందరు పిచ్చి గీతలతో మొదలు పెట్ట వలసిందే .

ఐదు సంవత్సరాలు నిండాయి . మొదటి తరగతి పూర్తయింది . హైదరాబాద్ లో మంచి పేరున్న పాటశాల . పేరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ . ఆ రోజుల్లోనే ప్రవేశ పరీక్ష , ఇంటర్వ్యూ . జూన్ 1990 నుంచి ఏప్రిల్ 1998 దాక ఇక్కడే చదువుకున్నాను. ఇంగ్లీషు , తెలుగు, విజ్ఞాన శాస్త్రం , గణితం ప్రధానంగా బోధించినా కళలకి , శారీరక శిక్షనకి అంతకు మించి ప్రధాన్యం ఇచ్చేవారు . ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నేను గీసిన బొమ్మలకి ఇక్కడే తొలి బీజం పడింది. ఈ పాటశాల లో గనక చేరకపోయుంటే నేను బొమ్మలు వేసుండేవాడినికాదేమో . 

ఉదయం ఆరు గంటలకి నిద్ర లేచేవాడిని. ఒక గంట చదువుకుని ఎనిమిది గంటలకల్లా తయారయ్యి మిత్రులులతో కలసి  బడికి వెళ్ళేవాడిని . తిరిగి సాయంత్రం 4:30 కి ఇంటికి వచ్చేవాడిని . మధ్యానం భోజనం అక్కడే. సాయంత్రం ఇంటికి వచ్చి బయటకెళ్ళి ఆడుకుని బడిలో ఇచ్చిన పనిని  పూర్తిచేసి భోజనం చేసి పడుకునేవాడిని . ఆదివారం ఇందికు భిన్నం.  రోజూ ప్రొద్దుటే  లేవడానికి బద్దకించినా ఆదివారం మాత్రం ఆ బద్ధకం మాయమైపోయేది . అందరి కంటే ముందు నిద్ర లేచేవాడిని .  లేచినదగ్గర నుంచి టీవీ ముందటే . 7:30 కి రంగోలి . 9: 00 ఇంటికి మహాభారత్ . 10 గంటలకి టామ్ అండ్ జెర్రీ కార్టూన్ షో . అప్పుడు కేబుల్ టీవీ లేదండోయ్ . దూరదర్సన్ మాత్రమే. ఇన్ని గంటలు టీవీ చూసిన తరువాత ఇంట్లో ఊరుకోరు కదా . ఇంకేముంది చదువు ...చదువు ...చదువు . సాధారణ మధ్య తరగతి కుటుంబం కదా తప్పదు మరి . మధ్యానం మాత్రం నా ఇష్టం . ఇంకేముంది బొమ్మలు గీయడమే . చదవడం అస్సలు ఇష్టం వుండేది కాదు. తెలుగు మాటకు చాలా ఇష్టం . రికార్డు పుస్తకాల్లో బొమ్మలు వెయ్యాలి కనుక విజ్ఞాన శాస్త్రం  అంటే కొద్దిగా ఇష్టం. ఎప్పుడు వ్రాయడమో లేకపోతే బొమ్మలు వేయడమో చేసేవాడిని . చదవడం తప్పించుకునే మార్గంగా చిత్రలేఖనాన్ని ఒక సరదాగా మార్చుకున్నాను. ఆదివారం కోసం ఎంతలా ఎదురుచూసేవాడినో , పండగలకోసం శెలవుల  కోసం అంతే  ఎదురుచేసేవాడిని. 

       అలా చిన్నగా బొమ్మలు వేయడం మొదలుపెట్టాను . నేను గీసేన మొదటి చిత్రాల్లో   ఒకటి ఈ డోనాల్డ్ డక్ . నా కంపాస్ బాక్స్ మీద ఉన్న బొమ్మను చూసి గీసిన చిత్రం. పెన్సిలు తో బొమ్మను గీసి, నల్ల సిరా కలం తీసుకొని అంచులు దిద్ది క్రేయోన్స్ (రంగు రంగుల సుద్దపుల్లలు) తో రంగులు వేసిన చిత్రం . ఇంటికి వచ్చిన వారందరికీ నేను గీసిన బొమ్మలు చూపించేవాడిని . అందరు బాగున్నాయి అని చెప్పేవారు. మా నాయనమ్మ (జాస్తి ఆదెమ్మ) నా బొమ్మలు చూసి ఇక్కడ బడి లో చదివితే నీకే ఫస్ట్ ప్రైజు ఇచ్చేవారు అని అనేది .  కానీ మావయ్య కి (పెద్ది సాంబశివ రావు ) చూపించినప్పుడు మాత్రం ఇదేంటి అదేంటి ఎలా గీసావు అని అడిగేవారు . `చిన్న చిన్న పరీక్షలు పెట్టేవారు . అలా నన్ను ఓ సారి ఎండాకాలం సెలవులకి నరసరావుపేట వెళ్లినప్పుడు ఇంగ్లీషు అక్షరాలతో బొమ్మలు వేయమన్నారు. మన పనిని మేచుకునేవారు వుండాలి , విమర్శించేవారు ఉండాలి. అప్పుడే మనం చేసే పని పట్ల కొంత శ్రద్ధ  వహించి కొంత భిన్నంగా ఆలోచిస్తాం . 


     అందరు పిల్లలు లాగే నాకు కార్టూన్స్ అంటే చాలా ఇష్టం . ఆదివారం 10 గంటలకి దూరదర్సన్ లో ఏదో ఒక కార్టూన్ షో వచ్చేది . మొదట టామ్ అండ్ జెర్రీ . తరువాత మొగ్లి. అల్లాదీన్ . డక్ టేల్స్ . పిల్లలు కార్టూన్స్ కి త్వరగా ఆకర్షితులవుతారు . అలా నేను ఇష్టపడే కార్టూన్స్ లో ఒకటి బాబోయి డెన్నిస్. ఈ టీవీ లో ఈ కార్టూన్ షో ప్రసారమయ్యేది. వాటి ప్రభావం తో గీసిన చిత్రాలివి . వీటిని ఏదో బొమ్మలు పిచ్చి  గోల అనుకుంటూ వుంటారు చాలా మంది. వీటి ఆకారాలు, వాడే రంగులు , మాట్లాడే మాటలు, చేసే చమక్కులు పిల్లలను టీవీ ముందు బంధించేస్తాయి. పిల్లలో ఊహాశక్తి ని పెంచుతాయి. అన్ని విషయాలు పుస్తకాల్లో చదివే తెలుసుకోం కదండీ . కొన్ని సంఘటనల ద్వారా , కొతమంది అనుభవాల ద్వారా తెలుసుకోవాల్సిందే కదా. ఇలా కార్టూన్స్ చూసి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు . ఎంత మంది తల్లులు టీవీ లో బొమ్మలు చూపించి గోరుముద్దలు తినిపించలేదు . ఎంతమంది తండ్రులు ఎత్తుకుని తిప్పమన్నప్పుడు టీవీ ముందు కూర్చోపెట్టి కార్టూన్లు చూపించలేదు . 

                                            క్రాయోన్స్ (రంగు సుద్దపుల్లలు ) తో గీసిన ఊహా చిత్రాలు 

                                                          
ఈ బొమ్మలు 5 , 6 తరగతుల్లో గీసినవి . ఇలాంటి రంగులు నిజజీవితం లో చూస్తామో లేదో కాని పిల్లల ఊహ కు చిన్న నిదర్సనం .

స్తబ్ధచేతన (Still Life )
తరువాతి మూడు చిత్రాలు 7వ తరగతి లో ఉండంగా గీసినవి . మా ఆర్ట్ మాష్టారు ఈ పూలపాత్రని ఎదురుగా పెట్టి గీయమనప్పుడు గీసినది . దీని ప్రత్యేకత ఏమిటంటే సాధారణంగా పెయింటింగ్ కాగితం మీద వేసినప్పుడు పోస్టర్ కలర్స్ ను వాడుతారు . కాని ఈ పెయింటింగ్ ను వేసినప్పుడు గుద్దల మీద వస్తువుల మీద వేసే రంగులు acrylic (అక్రయ్లిక్ ) కలర్స్ వాడాను . ఈ రంగులు పోస్టర్ కలర్స్ కన్నా చిక్కగా వుంటాయి . నా సామర్ధ్యాన్ని గుర్తించి మా మావయ్య (పెద్ది సంబసివ రావు ), మా అక్క (పెద్ది హరిపద్మ ), బావ (పెద్ది రామ రావు ) ఎప్పుడు ప్రొత్సహించేవారు. అందుకే ఎండాకాలం సెలవులు  ఎక్కువగా నరసరావుపేట లోనే గడిపేవాడిని . నేను 2 వ తరగతి లో వుండగా ఓ సారి మావయ్య హైదరాబదు వచ్చారు . నేను గీసిన బొమ్మను చూపించాను. అది చూసి బావుందే "నాకు ఇస్తావా నేను పట్టుకెల్తాను" అన్నారు . అది చూసి మా అమ్మ "ఛీ ఈ పిచ్చి బొమ్మని పట్టుకెల్తానంటావేంటి  అన్నయ్య " అని అంది . అప్పుడు మావయ్య ఆ బొమ్మలో తనకు ఏమి నచ్చిందో వివరణ ఇచ్చారు. ఇక అక్క గురించి చెప్పనక్కర్లేదు . ఓ సారి ఇంటికి తాటి తాండ్ర తెచ్చుకున్నాం . అది తిన్న తరువాత మిగిలిన టెంక కడిగి ఎండబెట్టి దానికి రంగులు వేశాం. చీకేసి పారాసే టెంకలను అలాగ కూడా వాడుకోవచ్చు అని అప్పుడే నేర్చుకున్నాను . ఇంగ్లీషు వ్యాకరణo , పాటలు పాడడం , వంటలు చేయడం , మట్టి కుండలకు రంగులేయడం, ఇలా ఎన్నెన్నో ప్రయోగాలు .  4 వ తరగతి లో ఉండంగా నన్ను మా బావ తన విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్న యువ అనే కార్యక్రమానికి తీసుకువెల్లదు. ఆకడికి వచ్చిన కళాకారులు ఎన్నో ప్రదర్సనలు, గొప్ప గొప్ప బొమ్మలు గీస్తున్నారు . వారి మధ్య నన్ను చేర్చి వారితో పాటు నేను కలసి బొమ్మలు వేసే ఏర్పాటు చేశాడు . వారి వల్లే నాకు కొంత కళల పట్ల అభిమానం పెరిగింది . 

 ఈ చిత్రాలు  చరిత్ర పాఠ్యపుస్తకం లోనివి . ఒక బొమ్మ  వేయడానికి స్ఫూర్తి ఏదైనా కావొచ్చు.

 పాఠ్యపుస్తకాలు కేవలం చదువుకోవడానికే కాదు ఇలా నచ్చిన చిత్రాలను చూసి కాగితం మీద గీయడానికి కూడా పనికొస్తాయి . 




ఇవి నేను 8 వ తరగతి చదువుతుండగా గీసిన      చిత్రాలు . మాకు వారానికి రెండు సార్లు ఆర్ట్ క్లాసు వుండేది . 

 క్లాసులో ఒక అంశం గురించి మాట్లాడి తగ్గట్టుగా  చిత్రాన్ని 
 గీయమనే వారు. అలా గీసిన చిత్రాలే ఇవి .  సాధారణంగా జెండా పండుగలప్పుడు,బాలలదినోత్సవానికి, లేదా గ్రీన్ డే, వాతావరణ కాలుష్యం అనే అంశాల మీద  పోటీలు నిర్వహిస్తుంటారు. అటువంటి పోటిలో పాల్గొన్నప్పుడు ఒక విషయం పట్ల అవగాహన , ఇచ్చిన గడువు లో ఎలా బొమ్మను పూర్తిచేయాలి అనే వాటి మీద కొంత అనుభవం వుండాలి . ఇలాంటి విషయాలను మాకు క్లాసు లో నేర్పించేవారు . 
ఈఫిల్ టవర్ - పారిస్




కలకత్తా హౌరా వారధి 
          ఈ బొమ్మలు నేను 9వ తరగతి లో ఉండంగా గీసినవి . తోటి మిత్రులంతా మేము ఇక్కడికి వెళ్ళాము అక్కడకి వెళ్ళాము అని చెబుతుంటే ఈ బొమ్మలు చూపించి నేనూ  కలకత్తా వెళ్లాను , ప్యారిస్ వెళ్ళాను అని గోప్పలుపోయే వాడిని.






      ఈ పైన బొమ్మలని  పై నుంచి కిందకు చూస్తే ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్ది గీసిన బొమ్మలలో  మార్పు , వాటి వివరం లో మార్పు, ఎంచుకున్న రంగులలో మార్పు కనిపిస్తుంది . వీటిని చిత్రీకరించినపుడు నేను గమనించక పోయినా ఇప్పుడు చూస్తే అర్ధమవుతుంది . పిచ్చి గీతాలతో మొదలయ్యే  చిత్రాలు వయసు పెరిగే కొద్ది జరిగే మానసిక అభివృద్ది వల్ల వాస్తవానికి దగ్గరగా వుంటాయి . వీటినే ఇంగ్లీష్ లో Scribbling Stage( స్క్రిబ్బ్లింగ్ దశ)  , Pre-Schematic Stage (ప్రీస్కెమాటిక్ దశ) , Schematic Stage (స్కెమాటిక్ దశ )  , Transitional Stage(ట్రాన్సిషనల్ దశ), Pseudo Naturalistic Stage (సూడో నాచురలిస్టిక్ దశ)  అని అంటూ  వుంటారు.

 ఇంతకి నా ఆస్తులు అని ఎందుకన్నానో ఇంకా చేపనే లేదు కదూ . నా బొమ్మలంటే నాకు ప్రానo . ఎప్పుడో చిన్నప్పుడు గీసిన బొమ్మలు ఇంకా ఇంతకాలం దాచుకున్నానంటే ఇప్పటికే అర్ధం అయి వుండాలి . అంతే కాదు నేను ఇంటర్ చదువుతున్నప్పుడు హాస్టల్ లో ఉండే వాడిని . అప్పుడు నా బొమ్మలన్నీ ఒక కవర్ లో సద్ది బీరువాలో భద్రపరిచారు . ఆ విషయం నాకు అప్పుడు తెలియదు. తరవాత నేను హాస్టల్ నుంచి రాగానే నా బొమ్మల కోసం వెతికినప్పుడు అవి లేవు . ఆ రోజు నేను ఎక్కడపోయాయో అని ఎంతగానో బాధపడ్డాను . అవే గనక దాచివుండకపోతే నేను గీసిన బొమ్మలని , జ్ఞాపకాలని మీతో పంచుకోగలిగే వాడినా చెప్పండి.

నాకు బాగా బాధ కలిగించే విషయం ఏమిటంటే ఇప్పుడున్న సమాజానికి వీటి పట్ల పెద్ద గురవం లేదు . డబ్బు సంపాదనే ముఖ్యమైపోయింది  . ప్రతి వాడు డాక్టర్ లేదా ఇంజనీరు కావలసిందే . విద్య వ్యాపారం గా మారింది . కట్టిన రుసుమును ఎలా తిరిగి సంపాదించాలి అనే ఆలోచనా ధోరణి .  మిగతా వారితో సమానంగా ఆస్తులు సంపాదించాలిగా మరి . సరే సంపాదనే ముఖ్యమనుకున్నా వ్రుత్తి పరమైన వత్తిళ్ళు లేకపోలేదు . సంపాదనకు కాక పోయినా  ఉపశమనానికి కూడా బొమ్మలు గీయోచ్చు. ఆర్ట్ మాస్టర్ , పెయింటర్ , ఆర్కిటెక్చర్ ,  ఫాషన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ , ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వృత్తులు . అన్ని వృత్తులని గౌరవించాలి  .  కాలాన్ని వృధా చేయకుండా కాస్త ప్రయోజనాత్మకంగా గడపడమే  . కళ  ఒక సరదా కావొచ్చు , కళ ఒక వృత్తి కావొచ్చు చేసే పని మీద శ్రద్ద వహించి  తగిన శ్రమపెడితే చాలు  . ఇంకేం తీయండి కాగితాన్ని , పెన్సిలు చేత పట్టండి , మీ రంగుల ప్రపంచాన్ని పరిచయం చేయండి .

ఉన్నవ పాటశాలల్లో కళలకు ప్రముఖ్యతనిస్తూ, మిగతా విషయాలతో పాటు కళల పట్ల ఆసక్తి ని అవగాహనను పెంచేందుకు చేస్తున్న ప్రయత్నానికి నా అభినందనలు .కొత్త బొమ్మలు కొత్త కళాకారుల కోసం ఎదురుచూస్తూ ...


గోపీ 

Monday, June 24, 2013

మావయ్య తో నా ప్రయాణం.

మావయ్యా  ముందుగా 70 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన జన్మదిన శుభాకాంక్షలు. 

జీవితమంటే జ్ఞాపకాల సమాహారం. చివరికి మిగిలేది జ్ఞాపకాలే . 

మావయ్యా నా జ్ఞాపకాల పయనం నీతో ఇలా మొదలైంది. 

నీళ్ళ చెంబు 
వేసవి కాలం సెలవులు నాయనమ్మ గారింటికి వచ్చాం  . అక్కడనుంచి అమ్మమ్మ గారింటికి . నీళ్ళ గాబు . పక్కనే చిన్న కుళాయి. కుళాయి నుంచి నీరు కారుతోంది. నీళ్ళ చెంబుతో ఆడుతున్నాను . నీరు వ్యర్ధం అవుతుంది కదా కుళాయి కింద చెంబు పెడితే ఆ నీరు వాడుకోవచ్చు కదా అనేది నా ఆలోచన . కాని నాకు అది ఎప్పటికి నిండుతుందో తెలియదు. వెంటనే నేను అమ్మని అది ఎప్పటికి నిండు తుంది అని అడిగాను. అమ్మ వెంటనే మావయ్యనడుగు చెబుతాడు అంది . మిమ్మల్ని అడిగితే చేతి  గడియారం చూసి సాయంత్రం ఐదు గంటలకు రా నిండుతుంది అని అన్నారు. నేను మధ్య మధ్య లో వచ్చి  చూసి వెళ్ళిపోయాను. సరిగ్గా ఐదు గంటలకి ఆ చెంబు నిండింది. ఎలా చెప్పారా అని నా కప్పట్లో ఆశ్చర్యం. 

గోపీ వస్తున్నాడు జాగ్రత్త 
చిన్నప్పుడు నాకోక అలవాటుండేది. ఎవరింటికి వెళ్ళినా నాకు నచ్చిన వస్తువుని చక్కబెట్టేవాడిని. గుంటూరు తాతయ్య గారింటి నుంచి నరసరావుపేట వచ్చాము. ఇంట్లో చిన్న  చిన్న చెప్పుల జతలు  చాలా  ఉండేవి. అవంటే నాకు చాలా ఇష్టం . ఆడుకున్నంత సేపు ఆడుకోని అవి మా సంచి లో వేసేశాను. ఎవరికీ చెప్పలేదు. తిరిగి గుంటూరు వెళ్ళటానికి రైల్వే  స్టేషన్ కి వచ్చాము.  ఇంతలో మా అమ్మ వాటిని చూసింది . వాటిని తిరిగి మీకు ఇచ్చేసింది. అప్పుడు నేను వాటికోసం చేసిన అల్లరి ఏడ్చిన తీరు నాకింకా జ్ఞాపకమే. 

ఆపద్బాన్ధవ్యుడా 
మా ఇంట్లో ఎప్పుడూ ఎవరో  ఒకరు ఉంటే బాగుండు, ఇంటికి ఎవరన్నా వస్తే బాగుండు అని అనుకునేవాడిని. ఎందుకంటే అమ్మ చేతి చివాట్లు తప్పేవి . చివాట్లతో సరిపెడుతున్నాను. మిగతావి మీకు తెలియనివి కావు. అలా గడుస్తున్న రోజులలో  ఎన్నోసార్లు ఆపద్బాన్ధవుడవయ్యావు. 

పిచ్చి గీతలు 
నేను ఒకటో తరగతి లో ఉండంగా నా వద్ద ఒక పెన్సిల్ డబ్బా వుండేది. ఆ డబ్బా మీద డోనాల్డ్ డక్ బొమ్మ ఎత్తుగా ఉండేది . బొమ్మలు వేయడం ఇష్టం కనుక  నేను ఒక పెన్సిలు కాగితం తీసుకుని దాన్ని అచ్చు వేసాను . అది సరిగ్గా రాలేదు. ఏదో ఒక ఆకారం సంతరించుకుంది. మా ఇంటికి ఒకసారి వచినప్పుడు కోతబోమ్మలు ఎం గీసావ్ అని అడిగారు. అప్పుడు నేను ఆ అచ్చు వేసిన బొమ్మని చూపించాను. వెంటనే మీరు "నాకు ఈ బొమ్మ కావలి . నేను తీసుకెళ్తాను" అని అడిగారు. అది విన్న అమ్మ వంటగది నుంచి వచ్చి ఏంటి అన్నయ్య ఈ పిచ్చి గీతలను బొమ్మలంటావు అని అడిగింది. అప్పుడు మీరు " నాకు ఒక అమ్మాయి నీళ్ళు పోసుకున్తున్నట్టుగా వుంది "అని అన్నరు. అది విన్న నేను ఆ బొమ్మ ని రెండు సార్లు చూశాను. నాకు అలాగే అనిపించింది . అలా ఆ పిచ్చి గీతలను బొమ్మలని అడగక పోతే నేను బొమ్మలేసుండేవాడిని కాదేమో . 

వేసవికాలం సెలవులు 
సంవత్సరం పాటు బడికెళ్ళి కష్కష్టపడి చదివి ఆ కష్టం అంతా  మరిచిపోయేట్టుగా చేసేవి వేసవి కాలం సెలవులు. మూడు నెలలు ఖాళీగా  ఇంట్లో తిని కూర్చోవడమే  అని అమ్మ తిట్టుకున్నా నాకు మాత్రం అవి ఎంతో  ఆనందాన్ని కలగజేసేవి . ఎందుకంటే చదవక్కరలేదు, పరీక్షలు లేవు, క్రికెట్ ఆడుకోవచ్చు , మిత్రులతో కాలక్షేపం చేయోచ్చు, ఊర్లు వెళ్లి రావచ్చు, రోడ్లవెంట తిరగొచ్చు .  నేను బహుశా 9వ తరగతి చదివేవరకు అన్ని వేసవి కాలం సెలవుల్లో నరసరావుపేట కచ్చితంగా వచ్చివెళ్లుంటాను.     

ముప్పాళ్ళ  క్యాంపు 
నాన్నకి తీరిక లేకపోవడం ఎక్కడికి పెద్దగ తిరగక పోవడం వల్లనో ఏమో తెలియదు కానీ బస్సు ప్రయాణాలన్నా, రైలు ప్రయాణాలన్నా అసలు తిరగడమన్నా చాలా ఇష్టం గా  మారింది. కిటికీ పక్కనే కూర్చునే అవకాశం వస్తే అస్సలు వదిలిపెట్టేవాడిని కాదు, విమానం ఎక్కేవరకు. వచ్చీపోయే ఊళ్ళ పేర్లు చదివి గుర్తుపెట్టుకునే వాడిని. ఎవరన్నా తోటి ప్రయాణికులు బండి ఎక్కడ ఆగుతుంది అంటే టక్కున చెప్పేవాడిని . అలాంటి ఒక ప్రయాణమే ముప్పాళ్ళ క్యాంపు. ఒక రోజు పొద్దున్నే నిద్ర లేచాను ఇంట్లో ఎవరూ లేరు . నాకు ఏమి తోచట్లేదు . క్యాంపు కి సిద్ధమవుతున్నారు . "ఏరా వస్తావా?" అని అడిగారు. అడిగిందే తడవుగా నేను సరే అన్నాను. జీపు లో ప్రయాణం కిటికీలు  లేవు. రోడ్డు  చక్కగా కనిపిస్తుంది. పైగా ఒక హోటల్ లో నేను బాగా ఇష్టం గా తినే పూరి తిన్నాం. ఇక నా ఆనందానికి అవధుల్లేవు.ఇవాన్నీ చిన్న చిన్న జ్ఞాపకాలే కావొచ్చు కాని నాకవి అమూల్యమైనవి. ఎందుకంటే నాకెంతో ఆనందాన్ని కలగజేసేవి. 

వోట్ ఫర్ BJP, Eraldite సీసా   
అక్క తో పాటు ఎండాకాలం సెలవులకు నరసరాపేట వచ్చాను.  బాయిలర్ లో నీళ్ళు కాచుకోవడానికి బొగ్గు వుండేది . ఆ బొగ్గు తీసుకుని గోడలనిండా కమలం గుర్తులు దానికింద వోట్ ఫర్ BJP , BJP గుర్తుకే మీ వోటు అని రెండు భాషలలో చక్కగా రాశాను. ఇంకేముంది కొద్ది సమయానికి అందరూ  చూశారు. తిడతారేమో, కొడతారేమో అనుకున్నా కానీ  రెండు జరగలేదు. అలాగే eraldite సీసా పొరపాటున చెయ్యి తగిలి కిందపడి పగిలిపోయింది. నాకు ఏమి తోచని పరిస్థితి. అప్పుడూ ఏమీ అనలేదు . ఈ రెండు సంఘటనలు నా తప్పును నేను తెలుసుకుని బాధపడే లా చేశాయి. అంతే కాదు మళ్ళీ సెలవులకు నన్ను రానివ్వరేమో అని భయం వేసింది. నాకు మీతో సమయం గడపడం అంత ఇష్టం. 

అక్షరాలూ బొమ్మలు 
మూడవ తరగతి కాబోలు . బొమ్మలు బాగా వేస్తాను అని తెలుసు కాబట్టి నాకొక చిన్న పరీక్ష పెట్టారు. అక్షరాలను సంఖ్యలను ఇచ్చి వాటిని బొమ్మలు గా మలచామన్నారు . నేను ప్రతి అక్షరాన్ని బొమ్మగా మలిచాను. అది ఇంట్లో అందరికి చూపించారు. అందరు మెచ్చుకున్నారు. చిన్నప్పుడు వచ్చే ఆలోచనలకు , ఊహలకు అసలు అంతేముంది . కాని ఆ ఆలోచనకు పదును పెట్టారు.  

క్రికెట్ కామెంటరీ 
చదువు మీద కన్నా  ఆటలు ముఖ్యంగా క్రికెట్ మీద ఇష్టం పెరుగుతున్న రోజులవి . టీవీ లో గంటలు తరబడి క్రికెట్ మ్యాచ్ లు చూసేవాడిని. కరెంటు పోయి ఏమి చెయ్యాలో తోచక బండల మీద నీళ్ళు చల్లుకుని మంచాలు వేసుకుని గాలిలేక  దోమల గోల మధ్య లో నా పిచ్చి వాగుడు. అదే క్రికెట్ కామెంటరీ . మ్యాచ్ లు  ఎక్కువగా చూస్తుండేవాడిని గనక అందులోనూ ఆడేటప్పుడు మాకు మేమే కామెంటరీ చెప్పుకునేవాలం కనుక నోట్లో  బాగా కామెంటేటర్ల కంమెంట్లు బాగా నానుతుండేవి  . అలా గోడమీద కూర్చొని నేను క్రికెట్ కామెంటరీ చెబుతుంటే దాన్ని చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఎలా చెప్పగలవో ప్రయత్నించమన్నారు. నన్ను బాగా ప్రోత్సహించారు. మాటలు మింగేస్తూ మౌనం గా ఉండే నాకు మాట్లాడే అవకాసం ఇచ్చారు. 

ఇలా ప్రతివేసవి వినూత్నంగానే వుండేది . కొబ్బరిపీచు తో గుడిసె పైకప్పుని ఎంత చక్కగా దాన్ని పేర్చి అతికించారో . చీపురు పుల్లలతో గుడిసె చుట్టూ దడి . సన్నటి మట్టి ని బంకమీద చల్లి  అలికిన నేల. గ్రీటింగు కార్డులు మిఠాయి డబ్బాల తో కూడా మేడలు కట్టొచ్చని చేసి చూపించావు. అసలు పనికి రాణి వస్తువు ఏదైనా ఉంటుందా అని అనిపించేది. ఇవి కాకుండా తపాలాబిళ్లలు , రూపాయి   బిళ్ళలు సేకరించడం  . పదవినోదాలు , ప్రతి ఆదివారం వచ్చే ఈనాడు తెలుగు పుస్తకం లో చుక్కలను కలపడం, టుమ్రీలు , రాసుకుంటూ పోతే రాసుకున్నన్ని . 

ఇప్పటి వరకు చెప్పినవి అన్ని నన్ను మెచ్చుకున్న ప్రోత్సహించిన సందర్భాలు మాత్రమే. అక్క పెళ్లి చూపులైన తెల్లారి అద్దెకు గ్లాసులు తీసుకువచ్చాం. అవి తిరిగి లెక్కపెట్టి అద్దెకు తెచ్చిన దగ్గర ఇవ్వాలి . మూడుసార్లు లెక్కపెట్టుంటాను . ఒక్కోసారి ఒక్కో లెక్క . కాని తెచ్చిన లెక్క కి మాత్రం సరితూగట్లేదు . అప్పుడు నన్ను కోప్పడ్డావు . అప్పుడు కాదు మావయ్య ఇప్పటికీ  అంతే . నోట్లు లేక్కేయడం నా వల్ల కాదు . 

శ్రీనాథుని కవిత 
నాకు లెక్కలు సరిగ్గా  అర్ధమయ్యేవి కాదు . దాంతో అవకాసం దొరికినప్పుడల్లా తప్పించుకునే ప్రయత్నం చెసేవాడిని . తెలుగు అంటే ఎంతో ఇష్టం . అలానే ఒకసారి ఎనిమిదవ తరగతి లో శ్రీనాథుని కవిత కంఠస్ధం పడుతున్నాను . దానికి అర్ధం తెలియదు . ఇంతలో వేరే గదిలో  ఉన్న మీరు వచ్చి దానికి అర్ధం చెప్పారు . ఇంతకి ఆ పద్యమేమిటంటే  
" సిరిగలవానికి చెల్లును 
తరుణులు పదియారువేల( తగ పెండ్లాడెన్ 
తిరిపెమున కిద్దరాండ్ర 
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్ " 
నేను ఎప్పుడు అలా చెప్పగలను, అదీ  చదవకుండా అని ఒక సందేహం వుండేది.  కాని తెలుగు భాష పట్ల ఇంకొంచెం ఇష్టాన్ని పెంచింది . 

ఇంక పిల్లల విషయానికి వస్తే చెప్పనక్కర్లెదు. బడికి వెళ్ళడం మొదలు పెట్టిన తొలినాళ్ళలో రాఘవుడు, మధ్యతరగతులలో హరెమ్మ , హై స్కూల్ దశ లో రాముడు . నేను వారితో గడిపిన సమయం లేదా వారు నా కోసం కేటాయించిన సమయం నేనిలా రూపుదిద్దుకోవడానికి ఎంతగానో దోహదపడింది . నిరంతరం అందుబాటులో ఉంటూ నా వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడింది వారే . మా నాన్న వాళ్ళకు మీరు ఎలా మార్గదర్శిగా నిలిచారో దాన్నే అనుసరించి నన్ను ఇలా తీర్చిదిద్దారు. అందుకు నేను అందరికి కృతజ్ఞుడిని . దాన్ని తెలిజేయడానికి ఇంతకంటే మంచి సందర్భం కూడా వుండదు  . 

ఇవన్నీ గుర్తుచేసుకుంటూ వుంటే  మీ ప్రభావం లేకుండా, ప్రమేయం లేకుండా కళను కళాకారులను ఆదరించాగాలిగేవాడినా, అభినందించగలిగేవాడినా ఆస్వాదించగలిగెవాడినా అనిపిస్తుంది.  నిరంతరం ఏదో చెయ్యాలి అనే తపన, వయసు తో సంబంధం లేకుండా ఏదో ఒకటి చేస్తూ వుండాలి అన్న ఆశయం , ఖాళీ గా కూర్చోకూడదు , పని లేదు అనే మాటలేకుండా, పుస్తకాలు, లైబ్రరీ, నాటికలు... ఏది నిలకడ . 

పిల్లలు , వాళ్ళ పిల్లలు, చదువులు, ఉద్యోగాలు, చికాకులు , ఆరోగ్యాలు, పనికిరాని చెత్తాచెదారం . ఇవన్నీ మనం సృష్టించుకున్నవే . వీటన్నిటి మధ్య ఒకరిగురించి ఆలోచించడానికి, అందరు ఒకచోట చేరి సంతోషంగా గదపడానికి కావలసిన సమయం ఎటు పోతొందో అర్ధం కాని పరిస్థితి. ఏడాదిన్నర కిందట నా పెళ్లి నాన్న పుట్టినరోజు సందర్భంగా  మీరు జరిపించిన కార్యక్రమం నాకు నేను ఉన్నంతవరకు గుర్తుండిపోతుంది . ఇప్పటికీ అది మదిలో మెదులుతూనే వుంటుంది . తలుచుకున్నప్పుడుల్లా ఆనందం తో కళ్ళల్లో నీల్లోస్తాయి. అందరు ఒకచోట కలవడం అనేది చాల అరుదు గా జరుగుతుంటుంది. మళ్లీ ఎప్పుదు కలుస్తామా  అనిపిస్తుంది. మీ పుట్టినరోజు సందర్భంగా అందరు కలుస్తున్నారని ఆశిస్తూ సెలవు. 

 సీతారామయ్య గారి మనవరాలు సినిమా నుంచి నన్ను ఎంతగానో ఆకట్టుకున్న ఆఖరున చెప్పే కొన్ని మాటలు 
"మమతానురాగాల  శాఖాచంక్రమణం 
అక్కడ ప్రవహిస్తున్న గోదావరి లాగానే 
ఎక్కడో సంసార సాగరం లో కలసి 
సంతోష మేఘాలుగా ఎగసి 
అనురాగ వర్షంగా కురిసి 
జీవనది గా వెలసి... తిరిగి సాగరం లో కలిసి 
మేఘాలుగా ఎగసి ... 
నిరంతరంగా ... తరం తరంగా 
కుటుంబ జీవన 
ఔన్నత్యానికి అర్ధం పడుతుంది " 

ఇట్లు 
మీ గోపీ